24న ఢిల్లీలో వైసీపీ ఆందోళన – జగన్
కూటమి సర్కార్ నిర్వాకంపై
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇది అప్రజాస్వామిక ప్రభుత్వమని పేర్కొన్నారు. పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రధానంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హత్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని, ఒకటి అధికర పక్షం మరోటి ప్రతిపక్షం అని అన్నారు.
ప్రతిపక్షంగా ఒకే ఒక్క పార్టీ ఉందని, తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. కూటమి సర్కార్ లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జూలై 24న న్యూఢిల్లీలో ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి.