అదానీతో బంధం అబద్దం – జగన్ రెడ్డి
ఆ ఆరోపణలన్నీ అవాస్తవం..సత్యదూరం
తాడేపల్లి గూడెం – వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీతో తాను వ్యాపారాలు చేశాసని, అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పరంగానే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది తప్పా వ్యక్తిగతంగా కాదన్నారు జగన్ రెడ్డి. కూటమి సర్కార్ కావాలని తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. గతంలో అసాధ్యం అనుకున్న మార్పులు ఆచరణలో చేసి చూపించడం జరిగిందన్నారు.
మేం తీసుకొచ్చిన ప్రతి మార్పు నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక, తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోనూ డోర్ డెలివరీ చేశామన్నారు. ఆ విధంగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చామని, వాలంటీర్ల ద్వారా 540 రకాల సేవలు అందించామని తెలిపారు.
విద్యా రంగంలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చామని స్పష్టం చేశారు. వైద్య రంగ పరంగా పల్లెల్లో వైద్య సేవలు అందించేలా చేయడం జరిగిందన్నారు జగన్ రెడ్డి. కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత తమదేనని చెప్పారు.
వ్యవసాయ పరంగా రైతుల వద్దకే సేవలు అందించేలా చేశామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం జరిగిందన్నారు. కానీ కూటమి సర్కార్ చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. అదానీతో తాను అంటకాగానని, లంచంగా కోట్లు తీసుకున్నానంటూ చేస్తున్న విమర్శలు సత్య దూరమన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.