విశాఖలో బాబు విఫలం – వైఎస్ జగన్
ధర్మం గెలిచింది న్యాయం నెలిచింది
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావించారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఏపీ సీఎం , టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు , కూటమి ప్రగల్భాలు పలికిందన్నారు. ఎలాగైనా సరే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని, డబ్బులు వెదజల్లి, కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేసినా చివరకు పోటీ నుంచి తప్పుకున్న పరిస్థితిని తీసుకు వచ్చామన్నారు జగన్ మోహన్ రెడ్డి.
838 సీట్లకు గాను తమ పార్టీకి 530కి పైగా సీట్లు ఉన్నాయని , తమ వారు ఎవరికీ లొంగబోమంటూ తేల్చి చెప్పారని అన్నారు. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు జగన్ రెడ్డి.
టీడీపీకి సంఖ్యా బలం లేక పోయినా బరిలో ఉండాలని అనుకోవడం మూర్ఖత్వం తప్ప మరోటి కాదన్నారు. ఏది ఏమైనా తమ పార్టీకి చెందిన అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలవడం ఖాయమని, ఇక ప్రకటించడమే లాంఛనమని పేర్కొన్నారు జగన్ రెడ్డి.