NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుపై జ‌గ‌న్ రెడ్డి ఫైర్

Share it with your family & friends

చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలు..మోసాలు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ మాజీ చీఫ్, వైసీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్ రెడ్డి . ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సీఎంకు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. బాబు గురించి చెప్పాలంటే, మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసం చేస్తాడు. దీనికోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడు.

తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ-ప్లేన్‌ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని 2 దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు, ఇప్పుడు సీ-ప్లేన్‌ మీద కూడా కహానీలు మొదలెట్టేశారంటూ ఎద్దేవా చేశారు.

దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేనట్టుగా, సీ-ప్లేన్‌ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగి పోయినట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారని అన్నారు. సీఎం బిల్డప్‌, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయంటూ మండిప‌డ్డారు.

ఓవైపు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టించిన మెడికల్‌ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్ ప‌రం చేస్తూ, స్కాంలకు పాల్ప‌డుతూ తన మనుషులకు తెగనమ్ముతూ, మరోవైపు దీని మీద ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ-ప్లేన్‌తో డ్రామాలు మొద‌లు పెట్టాడ‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి.

సీ-ప్లేన్‌ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచింది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత నిలిపేశారని పేర్కొన్నారు. గుజరాత్‌లో 2020లో సర్వీసులు నడవటం మొదలు పెట్టినా అవికూడా పలుమార్లు నిలిచి పోయాయని తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయని, మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదని ప్ర‌శ్నించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించి తద్వారా అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం కల్పించడమ‌ని, ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీలు కట్టి ప్రజలకు అందుబాటులోకి ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం అని తెలుసుకుంటే మంచిద‌ని చంద్ర‌బాబుకు హిత‌వు ప‌లికారు.