ఏపీలో రాచరిక పాలన – జగన్
ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం
అమరావతి – ఏపీ మాజీ సీఎం, వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ఆరోపించారు.
రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగ బడుతున్నారని మండిపడ్డారు జగన్ రెడ్డి. సూపర్-6 లేదు, సూపర్-7 లేదు.. ప్రతివర్గాన్ని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు జగన్ మోహన్ రెడ్డి. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యా దీవెన ఇవ్వడం లేదన్నారు. వసతి దీవెన కూడా అటకెక్కించారంటూ నిప్పులు చెరిగారు .
ప్రస్తుతం విద్యా రంగం గాడి తప్పిందని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు ఏపీ మాజీ సీఎం. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వక పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
ఆర్బీకేలు నిర్వీర్యం చేశారని, ఈ క్రాప్ లేకుండా పోయిందన్నారు. ఉచిత పంటల బీమా ఊసెత్తడం లేదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పథకాలన్నీ ఆగి పోయాయంటూ ఆరోపించారు.
100 రోజుల్లో 100 అత్యాచారాలు చోటు చేసుకున్నాయని, లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.