నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన బడ్జెట్ 2025పై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీకి ఇంత అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడేనని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎంపీల మద్దతుతో కేంద్రంలో కొలువు తీరిన మోడీ ఎన్డీయే సర్కార్ పూర్తి వివక్ష చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం, బాధ్యతా రాహిత్యం ఏపీ పాలిట శాపంగా మారిందన్నారు. ఇంత అన్యాయం జరిగినా ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు. నిధులు రాబట్టేందుకు ఎందుకు మోడీ సర్కార్ పై ఒత్తిడి చేయలేదంటూ నిలదీశారు నారా చంద్రబాబు నాయుడును. స్వంత ఇమేజ్ ను పెంచుకోవడంలో ఉన్నంత శ్రద్ద ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు కోవడం లేకుండా పోయిందన్నారు జగన్ రెడ్డి.
దశల వారీగా 17 వైద్య కళాశాలలను తీసుకు రావాలని తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రయత్నం చేశానని, వాటిని తీసుకు రావడంలో ప్రయత్నం చేయక పోవడం దారుణమన్నారు. అసలు సీఎంకు సోయి అనేది ఉందా అంటూ నిలదీశారు.