పోలవరం ఎత్తుని పరిమితం చేస్తే ఎలా ..?
పట్టించు కోలేదంటూ బాబుపై మండిపాటు
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన పోలవరంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి అన్యాయం చేసినా నోరు మెదపక పోవడం దారుణమన్నారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేయడాన్ని తప్పు పట్టారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలన్నారు జగన్ రెడ్డి. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు.
కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితం చేస్తున్నారని నిలదీశారు.
194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడి పోతుందని తెలిసి కూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని భగ్గుమన్నారు జగన్ రెడ్డి. ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంటుందన్నారు.
గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేమన్నారు జగన్ రెడ్డి. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేమని వాపోయారు.. అన్నికంటే సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుందన్నారు జగన్ రెడ్డి.