చంద్రబాబు వైఫల్యం ఏపీకి శాపం – జగన్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్
అమరావతి – టీడీపీ కూటమి సర్కార్ కొలువు తీరాక ఏపీ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు మొదలయ్యాయని ఆవేదన చెందార ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పార్టీ నాయకులు, పార్టీకి చెందిన జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు.
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం రెగ్యులర్ బడ్జెట్ ఇప్పటికీ పెట్టలేదని మండిపడ్డారు జగన్ రెడ్డి. ఇంకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నడుస్తోందని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెడితే ఏయే స్కీంకు ఎంత కేటాయించారన్నది చెప్పాల్సి ఉంటుందన్నారు. అలా చెప్పకపోతే ప్రజలు చంద్రబాబును తిడతారని భయపడి ఏకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం.
పాలనా పరంగా 100 రోజుల పాలన పూర్తిగా వైఫల్యం చెందిన చంద్రబాబు ఉన్నట్టుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదం అయ్యిందంటూ తెర మీదకు తెచ్చాడని మండిపడ్డారు. చివరకు దేవుడే ఆయనకు శిక్ష పడేలా చేశాడని అన్నారు. సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిన విషయాన్ని ఈ సందర్బంగా జగన్ రెడ్డి ప్రస్తావించారు.
ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితికి తీసుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం భారీగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అవుతాయని, వేధింపులు సర్వ సాధారణమని ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని సూచించారు జగన్ రెడ్డి.