కోర్టు ఆదేశించినా ఆగని ఆరోపణ – జగన్
తిరుపతి లడ్డూపై చంద్రబాబు మారని తీరు
అమరావతి – ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై ఇప్పటికే కావాలని నిప్పు రాజేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట మార్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.
తిరుమలలో ఓ వైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండగా మరో వైపు రాజకీయాల గురించి మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
తిరుపతి లడ్డూ వివాదాన్ని రాజకీయాలు చేయొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు జగన్ రెడ్డి. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఇంకా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా లడ్డూ వివాదానికి మంట పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ బాస్.
తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం తగదని, ఏదో ఒక రోజు సత్యం వెలువడక తప్పదని పేర్కొన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.