వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఆగ్రహం
అమరావతి – టీడీపీ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్ . తమ పార్టీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ పార్టీ నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చినా పట్టించు కోలేదన్నారు.
అధికార పార్టీ కుట్రను బట్ట బయలు చేస్తే, తమ బండారం బయట పడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి.
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబం పైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయ పెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.