నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – వైసీపీ బాస్ జగన్ నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వ అసమర్థత గురించి ప్రజలకు వివరిస్తామన్నారు జగన్ .
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మనం యుద్ధ రంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలన్నారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున గొంతు వినిపిస్తే మనకు తిరుగు ఉండదన్నారు.
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు జగన్ రెడ్డి. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటానని ప్రకటించారు. ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించు కోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు.
పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కళ్లు మూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచి పోతోందన్నారు. జమిలి ఎన్నికలని అంటున్నారని, అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుకు వస్తాయన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలన్నారు.