రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
-మాజీ సీఎం వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ విఫలమైందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన టీడీపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు దిగడం, దాడులకు తెగ బడటం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.
అన్ని వ్యవస్థలన్నీ నీరు గార్చారని, సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని ఇంకా చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హత్యలు, దారుణాలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడుకి పోతోందని అన్నారు. అయినా సీఎంకు, రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వేధింపులకు గురి చేయడం మంచి పద్దతి కాదన్నారు జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని కోరారు. తాను ఉన్నానంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.