నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్
అమరావతి – ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఓ వైపు అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్ట పోయినా పట్టించు కోవడం లేదన్నారు. నెల కిందట రూ. 26 వేలు పలికిన అరటి ఇవాళ రూ. 9 వేలు కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరటి మాత్రమే కాదు ఏ పంట అయినా ఇలాగే ఉందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలైమందని ఆరోపించారు. రైతుల వద్ద నుంచి కేజీ మిర్చిని కూడా కొనుగోలు చేయక పోవడం పట్ల మండిపడ్డారు.
వర్షాల కారణంగా నేల రాలిన అరటి పంటను స్వయంగా పరిశీలించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందని, తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఆరోపించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిర్చి, పెసర, శెనగలు, మినుముల పరిస్థితి కూడా అంతే ఉందన్నారు.. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడని వాపోయారు. తమ హయాంలో రైతులకు పూర్తి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.