ఏపీలో రాక్షస పాలన జగన్ ఆందోళన
ఢిల్లీలో వైఎస్సార్సీపీ ధర్నా
న్యూఢిల్లీ – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దాడులు, హత్యా కాండకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా జగన్ రెడ్డి ప్రసంగించారు.
ప్రజాస్వామ్య స్పూర్తికి భంగం వాటిల్లేలా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. 45 రోజుల పాలనా కాలంలో తమ పార్టీకి చెందిన వారిని పెద్ద ఎత్తున టార్గెట్ చేశారని, 30 మందికి పైగా నేతలను పొట్టన పెట్టుకున్నారంటూ వాపోయారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఈ విషయం గురించి తాను పీఎం మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖలు కూడా రాశానని అన్నారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో దారుణాలు చోటు చేసుకున్నాయని వాపోయారు.
టీడీపీ నేతల దాడులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. పోలీసులు చూస్తూ కూర్చున్నారే తప్పా చర్యలు చేపట్టిన పాపాన పోలేదన్నారు జగన్ రెడ్డి. గాంధీ చెప్పినట్టు ఎక్కడైనా అన్యాయం ప్రతి చోటా న్యాయానికి ముప్పు ఏర్పడుతుందన్నది వాస్తవమేనని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ తాను రాసుకున్న ఎర్ర పుస్తకం ఆధారంగా పాలన సాగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కొద్ది రోజుల పాలనా కాలంలో 30 మందికి పైగా హత్యలు, 300 మందికి పైగా హత్యా యత్నాలు, 35 మంది టీడీపీ వేధింపుల వల్ల ఆత్మహత్యలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, దాదాపు 2,700 కుటుంబాలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టాయని తెలిపారు.