కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ వైపు తాము ప్రజా పాలన సాగిస్తామని చెబుతూనే ఇంకో వైపు ప్రత్యక్షంగా దాడులకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దమనకాండను మరో స్థాయికి తీసుకు వెళ్లాడని ఆరోపించారు జగన్ రెడ్డి. ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన కేంద్ర ఆఫీసును బుల్ డోజర్లతో కూల్చి వేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని చంద్రబాబు పారిస్తున్నాడంటూ మండిపడ్డారు.
ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు తల వంచే ప్రసక్తి లేదన్నారు. వెన్ను చూపేది లేదంటూ హెచ్చరించారు.