ప్రజా ఆరోగ్యానికి కూటమి సర్కార్ పాతర
నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి టీడీపీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోందని ఆరోపించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం.
ఇప్పటికే స్పెషలిస్టు వైద్యులతో సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని మండిపడ్డారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారని ఆవేదన చెందారు.
తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారని ఆరోపించారు జగన్ రెడ్డి. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలను ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు.
ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాక పోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.