తండ్రి ఆశయాలకు కట్టుబడి ఉన్నా
స్పష్టం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా – వైఎస్సార్సీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన వైఎస్సార్ జిల్లా లోని ఇడుపులపాయ, పులివెందులలో పర్యటించారు. ఈ సందర్బంగా ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన తండ్రి సమాధి వద్ద కొద్ది సేపు ఉండి ప్రార్థన చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు.
జగన్ మోహన్ రెడ్డి వెంట ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.
తాను బతికి ఉన్నంత వరకు తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నానని, వైఎస్సార్ ప్రజల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.
చివరి వరకు ప్రజల కోసం పని చేశారని గుర్తు చేశారు. ఇవాళ తన తండ్రి గనుక ఉండి ఉంటే ఇంకా ఎన్నో అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు వచ్చి ఉండేవన్నారు. రెండు రోజుల పాటు జగన్ రెడ్డి పర్యటించనున్నారు.