మహిళలందరికి అభినందనలు
అమరావతి – అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేక పోతే ప్రపంచం లేదన్నారు. ఇవాళ అన్ని రంగాలలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్దిలో సైతం ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. చదువుపై , స్వశక్తితో పైకి వచ్చేందుకు కృషి చేస్తే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుందని స్పష్టం చేశారు మాజీ సీఎం.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా స్పందించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని తాను అని స్పష్టం చేశారు. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశామన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించడం జరిగిందన్నారు వైఎస్ జగన్ రెడ్డి.
నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశామని చెప్పారు. గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించామన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’అన్న నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుందని స్పష్టం చేశారు మాజీ సీఎం.