వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండి
స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ
అమరావతి – రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరారు ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి.
మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం సంప్రదాయాలకు విరుద్దమని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వ కూడదని ముందే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా చట్టంలో లేదన్నారు. ఉంటే చూపించాలని కోరారు జగన్ రెడ్డి.
పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ నిబంధన పాటించిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్న కూటమితో పాటు స్పీకర్ ఇప్పటికీ తన పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
.అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు తోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్ట బద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నట్లు తెలిపారు మాజీ సీఎం.