వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన సోదరుడు, వైసీపీ బాస్ వైఎస్ జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజల నమ్మకాన్ని, పార్టీకి సంబంధించిన నేతల విశ్వాసాన్ని కోల్పోయాడని అన్నారు. ఒక రకంగా ఏపీలో తన చాప్టర్ క్లోజ్ అయ్యిందంటూ పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయ పరంగా తన ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
జగన్ కు నమ్మిన బంటు విజయ సాయి రెడ్డి అని, తనను అనరాని మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, విజయ సాయి కలిసి డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. విజయసాయి రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడని , ఏ పని ఆదేశిస్తే…ఆ పని చేయడం..ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.
రాజకీయంగా కాదు..వ్యక్తిగతంగా కూడా..నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అంటూ మండిపడ్డారు. ఈ అబద్ధాలు జగన్ చెప్తే సాయి రెడ్డి చెప్పాడన్నారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడు అంటే చిన్న విషయం కాదన్నారు. ఈ విషయంలో వైసిపి కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలన్నారు. సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు , ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ ను వీడుతున్నారో ఆలోచించాలన్నారు.
జగన్ నాయకుడుగా విశ్వసనీయత కోల్పోయారని స్పష్టం చేశారు వైఎస్ సఱ్మిలా రెడ్డి. నాయకుడుగా ప్రజలను, నమ్ముకున్న వాళ్ళను మోసం చేశారని అన్నారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుంటే మేలని హితవు పలికారు.