రాప్తాడులో బాధిత కుటుంబానికి పరామర్శ
అనంతపురం జిల్లా – మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తప్పు చేసిన ఏ పోలీస్ అధికారిని వదలమన్నారు. బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కాండ ఎక్కువ కాలం సాగదన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టమొచ్చినట్లు చేయకండన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదన్నారు. చట్టం ముందు దోషులుగా నిలబెడతామని, వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు. ఇక నుంచైనా పోలీసులు మారాని హితవు పలికారు.
మంగళవారం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించారు. భారీ బందోబస్తు మధ్య ఆయన రాప్తాడును సందర్శించారు. అక్కడ తమ పార్టీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ తెలిపారు. అధికారంలో ఉన్నామని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఈ పాలన పట్ల జనం తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు.