ఏపీలో కూటమి సర్కార్ పై ఫైర్
అమరావతి – వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను ఆవిష్కరించారు పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయంలో . గ్రామ స్వరాజ్యం స్ధాపనకు తమ హయాంలో కీలక చర్యలు తీసుకున్నామని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు ఈ డైరీ ఓ దిక్సూచి లాగా ఉపయోగ పడుతుందని చెప్పారు.
ఈ సందర్బంగా పూర్తి సమాచారంతో తయారు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. భారత రాజ్యాంగాన్ని, స్థానిక సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసు కోవాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ది దిశగా తీసుకున్న నిర్ణయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ సీఎం. స్ధానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గండికోట శ్రీకాంత్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ ఎంపీపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.