ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలి
పార్టీ సమీక్షలో వైఎస్ జగన్ రెడ్డి
అమరావతి – రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త సర్కార్ చేస్తున్న హడావుడిపై సెటైర్ వేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. తన క్యాంపు కార్యాలయంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో ప్రస్తావించాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కానీ ప్రజలు మనల్ని విశ్వసించ లేక పోయారని అన్నారు. గతంలో ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశామన్నారు. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదన్నారు.
రాష్ట్రంలో 40 శాతంకు పైగా ప్రజలు వైసీపీని ఆదరిస్తున్నారని అర్థమై పోయిందన్నారు. కొద్ది పాటి తేడాతో సీట్లను కోల్పోయామని, అయినా రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు జగన్ రెడ్డి. విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయడం జరిగిందన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయని, ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు జగన్ రెడ్డి. అందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నేతలు పర్యటించి భరోసా ఇవ్వాలని సూచించారు.