టీడీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదు – జగన్ రెడ్డి
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి
గుంటూరు జిల్లా – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. గత కొంత కాలంగా తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులను పనిగట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బుధవారం మాజీ మంత్రి విడుదల రజనితో కలిసి జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా జైలులో ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లడాడారు జగన్ మోహన్ రెడ్డి.
నందిగం సురేష్ ను కావాలని కుట్ర పన్ని అక్రమ కేసులో ఇరికించారంటూ ఆరోపించారు. ఆయనను అర్థరాత్రి సమయంలో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు, తమ వైఫల్యాలు బయట పడకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి.
తాను సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ లేదన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎన్నడూ చూడలేదన్నారు. వరదలను అరికట్టడంలో బాబు ప్రభుత్వం విఫలమైందన్నారు.
నాలుగు ఏళ్ల కిందట పట్టాభి ప్రెస్ మీట్ లో దూషించారు. అనరాని మాటలు అన్నారు. అందుకే తమ పార్టీకి చెందిన వారు టీడీపీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారన్నారు. ధర్నా చేసిన వారిపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ ఆరోపించారు. సాక్షులను భయపెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎక్కువ కాలం ఉండదన్నారు. టీడీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.