Saturday, May 24, 2025
Homeవైసీపీ కార్య‌క‌ర్త హ‌త్య దారుణం - జ‌గ‌న్

వైసీపీ కార్య‌క‌ర్త హ‌త్య దారుణం – జ‌గ‌న్

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం

అమ‌రావ‌తి – మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగ‌మ‌య్య‌ను దారుణంగా హ‌త్య చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. బీసీ కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. కుటుంబానికి పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. చట్టబద్ధ పాలన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, వారి దాడులను వ్యతిరేకించినందుకు టీడీపీ నాయకులు భూమి మీద లేకుండా చేశార‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని, రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉందని, అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో బాధ్యతా రాహిత్యం కారణంగానే ఈ ఘటనకు దారి తీసిందన్నారు. రామగిరిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించినా, పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.

బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments