మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
గుంటూరు జిల్లా – మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందంటూ ఆరోపించారు. అన్నదాతలు పండించే పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందంటూ మండిపడ్డారు. తమ హయాంలో క్వింటాలు మిర్చి ధర రూ. 21 నుంచి 27 వేలు ఉండేదన్నారు. కానీ చంద్రబాబు వచ్చాక కేవలం క్వింటాలుకు 8 నుంచి 11 వేలకు పడి పోయిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారవేత్తలకు వత్తాసు పలకడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.
బుధవారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. రైతులను పరామర్శించారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కల్పించక పోవడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు జగన్ రెడ్డికి.
తాము ఎందుకు చంద్రబాబుకు ఓట్లు వేశామా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పంట బాగుంటే ఎకరాకు సగటున కనీసం 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందన్నారు. ఈసారి తెగుళ్ల కారణంగా దారుణంగా పడి పోయాయని ఆవేదన చెందారు. ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదన్నారు. పెట్టుబడి పరంగా ఎకరాకు లక్షన్నరకు పైగా ఖర్చవుతోందన్నారు.