ఏపీలో ప్రజలకు రక్షణ కరువు – జగన్
కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
కడప జిల్లా – మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ కొలువు తీరాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందన్నారు. కంట్రోల్ లేకుండా పోయిందన్నారు. అత్యాచారాలు, హత్యలు, దాడులు, కేసులు పెరిగాయే తప్పా తగ్గడం లేదన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న వారిని కంట్రోల్ చేయలేక పోతున్నారని ఆరోపించారు.
బుధవారం కడప జిల్లా బద్వేల్ లో ప్రేమోన్మోది చేతిలో దారుణ హత్యకు గురైన దస్తగిరమ్మ కుటంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్ . బద్వేలు ఘటన శనివారం నాడు జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించ లేదని ఆరోపించారు. కనీసం పట్టించు కోలేదని మండిపడ్డారు జగన్ రెడ్డి.
ఇవాళ తాను ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందిందన్నారు. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయని వాపోయారు. అసలు పాలన అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉందంటూ ధ్వజమెత్తారు జగన్ రెడ్డి. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కన పెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయాలని సూచించారు.