ఏపీ సర్కార్ కు వైఎస్ షర్మిల డెడ్ లైన్
4 లోపు కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి
విశాఖపట్నం – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సర్కార్ కు. బుధవారం ఆమె విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బైఠాయించారు. ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ షర్మిలా రెడ్డి డెడ్ లైన్ విధించారు. ఈ నెల 4 న మధ్యాన్నం ఒంటి గంట లోపు తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేకుంటే ప్లాంట్ ఆవరణలోనే తొలగించిన కార్మికులకు అండగా నిరాహార దీక్ష కు దిగుతానంటూ హెచ్చరించారు వైఎస్ షర్మిలా రెడ్డి. 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయం అని వాపోయారు. నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదు, పైగా నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గమన్నారు.
విశాఖ స్టీల్ ఆంధ్రులకు తలమానికమని, కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లాభాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో,దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయే సరికి ప్లాంట్ ను నీరు గార్చారని ఆరోపించారు.
అంచెలంచెలుగా ప్లాంట్ ను దెబ్బ తీశారని వాపోయారు. 32 మంది బలిదానాలు తో ప్లాంట్ ఏర్పడిందన్నారు. ఎంతో మంది భూములు స్వచ్చందంగా ఇచ్చారని గుర్తు చేశారు.
విశాఖ కు సొంత గనులు లేవని, ప్లాంట్ కు వచ్చే ముడి పదార్థాల ధరలు కావాలని పెంచారని ఆరోపించారు. పాలకులు దీనిని సిక్ ఇండస్ట్రీగా మార్చేశారని వాపోయారు వైఎస్ షర్మిలా రెడ్డి. నష్టాల సాకు చూపి అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆదుకొనే చిత్తశుద్ది ఎవరికి లేదన్నారు.
కాంగ్రెస్ హయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్లాంట్ విస్తరణ చేపట్టారని, 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నులు పెంచారని తెలిపారు. 20 మిలియన్ టన్స్ కి పెంచేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారని వెల్లడించారు. ఒకప్పుడు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తిచేసే ప్లాంట్ ను ఒక మిలియన్ టన్నుకు తగ్గించారని ఆరోపించారు. జగన్ కి నష్టాల్లో ఉన్నట్లు తెలియదట..చంద్రబాబు హామీ ఇచ్చాడట కానీ అమలు కాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
విశాఖ భూముల మీద మోడీ కన్ను పడిందని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. కార్మికులు గత 13 వందల రోజులుగా చేస్తున్న దీక్ష ప్రభుత్వాలకు కనిపించడం లేదని అన్నారు. భరోసా ఇవ్వాల్సిన భాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు కి ఉందన్నారు. సీఎం వెంటనే స్పందించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.