ఓటేసిన షర్మిల..బ్రదర్ అనిల్
గెలుస్తానన్న నమ్మకం ఉంది
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో కలిసి సోమవారం కడపలో ఓటు వేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఇవాళ తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని చెప్పారు. కడప లోక్ సభ స్థానానికి తాను పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. తన తండ్రి, దివంగత సీఎం, మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకనాడు కడప ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు.
తన కోసం వేసే ప్రతి ఓటు తన తండ్రికి ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. ఒక రకంగా ఓట్ల ద్వారా ఆయనకు నివాళులు అర్పించిన్నట్లు అవుతుందని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
ఈసారి ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరిగినట్లు తాను భావిస్తున్నట్లు చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు ఏపీ పీసీసీ చీఫ్.