జగన్ కామెంట్స్ షర్మిల సీరియస్
నీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రావాలి
అమరావతి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి . శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తాను ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ప్రకటించ లేదంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు ఏపీ పీసీసీ చీఫ్.
ఏం ఉద్దరించావని నీకు తమ పార్టీ మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అంటకాగినందుకు మద్దతు ఇవ్వాలా అని ఎద్దేవా చేశారు.
విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇవ్వడం అప్పుడే మరిచి పోతే ఎలా జగన్ అంటూ నిప్పులు చెరిగారు.
మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని స్పష్టం చేశారు.