మీ ఆడబిడ్డలం ఆశీర్వదించండి
ఓటు వేయమని వేడుకున్న షర్మిల
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మీ ఆడ బిడ్డలం..కొంగుచాచి అడుగుతున్నామని అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.
తన సోదరుడు , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అన్న సీఎం కావడం కోసం ఏకంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టామని అయినా తనను ఇబ్బందులకు గురి చేశారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అన్న కోసం ఇళ్లు, వాకిలి వదిలేసి తిరిగానని చెప్పారు. అన్న సీఎం అయితే దివంగత వైఎస్సార్ సంక్షేమ పాలన వస్తుందని అనుకున్నానని కానీ చూస్తే గెలిచాక అరాచకాలు, హత్యలు, దారుణాలు, మోసాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
ప్రధానంగా తన చిన్నాన్న దివంగత వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసినా ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదన్నారు. విచిత్రం ఏమిటంటే ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారికే ఎంపీ టికెట్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి.