ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్
తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి
అమరావతి – ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. తనను గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. ప్రశ్నించడాన్ని జగన్ మోహన్ రెడ్డి, ఆయన పరివారం తట్టుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
జగన్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు. మీరు పూర్తి చేయని హామీలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నాకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని నిలదీశారు.
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక రాచరికపు పాలన లో ఉన్నామా? మెగా డీఎస్సీ కావాలి దగా డీఎస్సీ వద్దు అని ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇద్దామని వెళ్లానని తెలిపారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారని, భౌతిక దాడికి పాల్పడి గాయ పరచడం బాధ కలిగించిందన్నారు.
అధికారం శాశ్వతం కాదు అన్నది గుర్తు పెట్టుకోవాలని అన్నారు వైఎస్ షర్మిల. ఏపీలో ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. సీఎం రాడు.. మంత్రులు లేరు.. అధికారులు రారు.. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనమన్నారు.