జర్నలిస్టులపై దాడులు దారుణం
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఫైర్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు, ప్రత్యేకించి జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
రాప్తాడు వేదికగా జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కృష్ణపై , కర్నూల్ లో ఈనాడు ఆఫీసుపై వైసీపీ మూకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కావాలని ఉద్దేశ పూర్వకంగానే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తుంది అనడానికి ఈ దాడులే నిదర్శనమని అన్నారు. .నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు దిగడం, కొట్టి చంపడాలు అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
పత్రికల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేసినట్టుగా భావించాల్సి వస్తుందన్నారు.