ఏపీ సీఎం త్వరగా కోలుకోవాలి
సోదరుడి పై దాడి దారుణం
అమరావతి – ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో మేమంతా సిద్దం యాత్రలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దాడికి గురయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రాయి విసిరారు. అది నేరుగా సీఎం నుదుటిని తాకింది. ఎడమ కంటి పై భాగానికి బలంగా తాకింది. దీంతో ఆయనను హుటా హుటిన చికిత్స నిమిత్తం బస్సులోకి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేపట్టారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ వైపు గాయమైనా లెక్క చేయకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రచారం తిరిగి ప్రారంభించారు. ఇదిలా ఉండగా దాడి జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
ప్రజా స్వామ్యంలో దాడులకు కొదవ లేదన్నారు. ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని సూచించారు. ఆయనపై దాడి చేయడం మంచి పద్దతి కాదన్నారు వైఎస్ షర్మిల. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా కావాలని చేసి ఉంటే మాత్రం తప్పకుండా ఖండించాల్సిందేనని పేర్కొన్నారు. డెమోక్రసీలో హింసకు తావు లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.