NEWSANDHRA PRADESH

బాబూ మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు ఎప్పుడు..?

Share it with your family & friends

స‌ర్కార్ ను నిల‌దీసిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ పై, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో తోటి మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ఈ సంద‌ర్బంగా ఆమె బ‌స్సులో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం నెర‌వేర్చ లేద‌ని ఆరోపించారు. ఎందుకు ఇంత ఆల‌స్యం అవుతుందో సీఎం చెప్పాల‌ని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారని కానీ చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారంలో అమలు చేశారని , కానీ ఇక్క‌డ అమ‌లు చేసేందుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారని కానీ మీకు మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, రోజు మహిళల ద్వారా రూ.7 నుంచి 10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తుందన్నారు.

ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది అని భయమా ?. మహిళల చేత ఓట్లు వేయించుకున్నారని, అప్పుడు ఎందుకు ఇది గుర్తుకు రాలేద‌న్నారు. మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పతకాలు మహిళలవే.

ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు అని, ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా..? అని నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నామ‌ని అన్నారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తన పోస్ట్ కార్డులు పంపిస్తామ‌ని పేర్కొన్నారు. ఇది చూసైనా వెంటనే చంద్రబాబు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామ‌ని అన్నారు.