కూటమి సర్కార్ ను డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల
అమరావతి – గ్రూప్ 2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92 వేల 250 మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ లో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వీటిని సరిదిద్దక పోతే తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందన్నారు. న్యాయ పరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయన్నారు. దీనిపై మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని , న్యాయం చేయాలని కోరారు వైఎస్ షర్మిల.
తప్పులను సరిదిద్దకుంటే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ విషయంపై అభ్యర్థులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు . రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయ్యిందన్నారు.
ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఇక్కడ కూడా ఎదురవుతాయని భయపడుతున్నారని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతుంటే, మరోవైపు అడ్వకేట్ జనరల్ సైతం కోర్టులో తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే, హడావుడిగా ఈ నెల 23న పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోక పోతే ఎలా అని నిలదీశారు.