Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHకూట‌మి ప్ర‌భుత్వం రైతుల‌కు శాపం

కూట‌మి ప్ర‌భుత్వం రైతుల‌కు శాపం

కంట‌త‌డి పెట్టిస్తున్న ఎర్ర బంగారం

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. కూట‌మి స‌ర్కార్ రైతుల‌ను ఆదుకోవడంలో విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. మిర్చి రైతుల‌ను నిట్ట నిలువునా ముంచింద‌ని మండిప‌డ్డారు. ఎర్ర బంగారం ఏడిపిస్తోంద‌న్నారు. న‌ష్టాల ఘాటుకు రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటూ వాపోయారు. పెట్టుబడి మందం రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ న‌ష్టాల పాల‌వుతున్న రైతుల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన సీఎం సొల్లు క‌బుర్లు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గొప్ప‌లు చెబుతోందంటూ ఎద్దేవా చేశారు. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మిర్చి పంటకు కనీస ధర రూ.26 వేలుగా ప్రకటించాలని అన్నారు.

లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా ధరల స్థిరీకరణ నిధి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలన్నారు.

మిర్చి రైతు విలవిలలాడుతుంటే టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయ‌న్నారు గిట్టుబాటు ధర లేక, కనీసం పెట్టుబడి రాక, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారని అన్నారు. మార్కెట్ లో కేజీ టమాట రూ.15 పలుకుతుంటే రైతుకు కిలో మూడు, నాలుగు రూపాయలు కూడా దక్కడం లేద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments