వరద బీభత్సం ఏపీ హృదయ విదారకం
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగ్ నగరలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతమని వాపోయారు.
బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కు పోయిందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. వరదల్లో ఇప్పటికీ 35 మంది చని పోయారని, 35 వేల ఇళ్లు కూలి పోయాయని పేర్కొన్నారు.
మొత్తం 5 లక్షల మంది దాకా నష్ట పోయారని అన్నారు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించ లేదని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్.
విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదా అని నిలదీశారు. తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరమని కొనియాడారు.
కానీ సహాయక చర్యలు గ్రౌండ్ లెవల్‌కి చేరడం లేదని ధ్వజమెత్తారు. 2005లో ఇలాంటి వరదలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారని గుర్తు చేశారు. బుడమేరు వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. ఆపరేషన్ కొల్లేరును క్లియర్ చేశారు. ఆరోజుల్లో బుడమేరు కట్టలు బలోపేతం చేశారని అన్నారు.
కానీ గత 10 ఏళ్లలో బుడమేరులో ఆక్రమణలు జరిగాయని . తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించి రిటర్నింగ్ వాల్ కట్టాలని కోరారు వైఎస్ షర్మిల.