ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. లేక పోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ మద్దతును ఉపసంహరించు కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టి జరగాలని చెప్పే మీరు..హోదాతోనే సంపద సృష్టి జరుగుతుందని తెలుసుకోక పోవడం మీ అవివేకానికి నిదర్శనం అంటూ సీఎంపై మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాయని, ఆ మాత్రం చంద్రబాబు నాయుడు తెలుసుకోక పోవడం దారుణమన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే హోదా సాధించుకున్న రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి 4 వందల రెట్లుగా ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఉంటే ఎంత అభివృద్ధి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసహరించు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఏపీపీసీసీ చీఫ్.