NEWSANDHRA PRADESH

క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలి

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి డిమాండ్

క‌డ‌ప వైఎస్సార్ జిల్లా – మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల కోరిక అయిన కడప స్టీల్ ప్లాంట్ ను తక్షణమే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల‌ని కోరుతూ ఈ సంద‌ర్బంగా వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నా గత 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు, జగన్ రెడ్డిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు త‌ప్పా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం లేద‌ని ఆరోపించారు.

తమ స్వార్థ రాజకీయాల కోసం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

.2019లో జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనలకు మళ్ళీ శంకుస్థాపన చేశారని మండిప‌డ్డారు. ఎన్నికలకు 6 నెలలు ముందు కొబ్బరికాయ కొడితే మోసం అంటారని.. ఎన్నికలు అయిన 6 నెలలు తర్వాత కొబ్బరికాయ కొడితే చిత్తశుద్ధి అంటారు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.

కానీ ఆ మాటలు ఒట్టి మాటలే అని తేలి పోయిందన్నారు. ఎందుకంటే ఈ ప్లాంట్ నిర్మాణం కోసం గ‌త జగన్ ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌తో రూ.8,800 కోట్లతో ఒప్పందం చేసుకుందన్నారు. ఇందుకోసం 3,500 ఎకరాల భూమిని జిందాల్‌కి అప్పగించాడని మండిప‌డ్డారు.

అయినా కానీ జిందాల్ కంపెనీ ఇంత వరకు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఫైర్ అయ్యారు ఏపీపీసీసీ చీఫ్‌.

రాష్ట్ర విభజన హామీలలో భాగంగా UPA ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హక్కు కడప స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ తరుపున గట్టిగా డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు.

లేదంటే వైఎస్సార్ కల అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.