రతన్ టాటా కోట్లాది మందికి దిక్సూచి – షర్మిల
ఆయన వ్యక్తి కాదు అద్భుతమైన వ్యవస్థ
అమరావతి – భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావాల్ టాటా మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆయన లేని లోటు పూడ్చ లేనిదన్నారు. ఈ దేశం నిజమైన రత్నాన్ని కోల్పోయిందన్నారు. ఒకటా రెండా అనేక సంస్థలను స్థాపించడమే కాకుండా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన ఘనత రతన్ టాటాకే దక్కుతుందన్నారు.
రతన్ టాటా తన దూరదృష్టితో కూడిన నాయకత్వం, నైతిక వ్యాపార పద్ధతుల పట్ల నిబద్ధతతో పని చేయడం ప్రశంసనీయమన్నారు వైఎస్ షర్మిల. కార్పొరేట్ సామాజిక బాధ్యతను నొక్కి చెబుతూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ పవర్‌హౌస్‌గా మార్చాడని కొనియాడారు .
దాతృత్వ ప్రయత్నాలు భారతదేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. టాటా సమగ్రత, వినయం, ఆవిష్కరణ పట్ల అంకితభావం రాబోయే తరాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యవస్థాపకులు, వ్యాపార నాయకులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రతన్ టాటాకు మరణం లేదు. ఆయన మహోన్నత మానవుడు. కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. చరిత్ర ఉన్నంత కాలం రతన్ జీ బతికే ఉంటారని స్పష్టం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.