బీజేపీ నేతలపై వైఎస్ షర్మిల ఫిర్యాదు
గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఏపీపీసీసీ చీఫ్
విజయవాడ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
బుధవారం ఆమె విజయవాడ గవర్నర్‌పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని చంపాలంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. వెంటనే సదరు కామెంట్స్ చేసిన బీజేపీ నేతలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేక పోతే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ అధికారంలోకి రావాలని బీజేపీ పదే పదే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీని చంపుతామంటూ బహిరంగంగా కామెంట్స్ చేయడం దారుణమన్నారు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అంతకు ముందు బెజవాడ వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.