సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం – షర్మిల
విచారణను కేంద్ర సంస్థకు ఇవ్వాలని కోరాం
విజయవాడ – తిరుపతి లడ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందన్నారు.
ఈ దర్యాప్తు బృందంలో CBI, FSSAI , రాష్ట్ర పోలీసుల ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింన్నారు. లడ్డు వివాదం బయటకు వచ్చిన రోజే కాంగ్రెస్ పార్టీ మొట్ట మొదటిగా సిబిఐ విచారణకు పట్టుబట్టిందని చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి.
తమ డిమాండులో భాగంగా కేంద్ర సర్కారుకు, రాష్ట్ర గవర్నర్ కు, సుమోటో కింద సుప్రీంకోర్టు కేసును స్వీకరించాలని గౌరవ చీఫ్ జస్టిస్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పారు.
నేటి అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో విచారణ నిష్పక్ష పాతంగా, వేగంగా ముందుకు సాగి, లడ్డు కల్తీ విషయంలో నిజాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తోందని అన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ విషయంలో, వారందరూ కూడా నిజాలు కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. లడ్డులో కనుక కల్తీ జరిగిందని నిరూపణ అయితే, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతున్నానని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.