గెలిపించింది పారి పోవడానికి కాదు
జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ లోకి అడుగు పెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఒక రకంగా జగన్ రెడ్డి అజ్ఞానం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు. పిరికితనం, చేతకానితనం, అహంకారం కారణంగా ప్రజలు దూరం పెట్టారన్న సంగతి తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రజలు ఎన్నుకున్నది మీ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను తమ తరపున మీ గొంతుక వినిపిస్తారని కానీ మీరేమో పారిపోతానంటే ఎలా అని నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఓట్లు వేసిన పాపానికి ఇలా మోసం చేస్తే ఎలాగా అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి వెళ్లకుండా ధర్నాలు చేయడం, మీడియా సమావేశాలు నిర్వహించడం ఓ పార్టీ నేతగా, మాజీ సీఎంగా తగదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట సభల్లో ప్రజల గొంతుక వినిపించ డానికా లేక స్వంత డబ్బా కొట్టు కోవడానికా అని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్.
అధికార పక్షం రోజుకో శ్వేత పత్రం విడుదల చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి పోనంటూ చేసిన మీ ప్రకటన విస్తు పోయేలా చేసిందన్నారు. మీరు నాయకుడిగా, ఎమ్మెల్యేగా అనర్హుడంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.