రేషన్ మాఫియా బిగ్ స్కాం – షర్మిల
విచారణకు ఆదేశించాలని డిమాండ్
అమరావతి – రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని పేర్కొన్నారు.
తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని మండిపడ్డారు షర్మిల. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళు మూసుకుందని ఆవేదన చెందారు.
సోమవారం ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చు అన్నారు.
ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు నిజాలు నిగ్గు తేల్చాలంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు ? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు ? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా ? తీగ లాగితే వెనకున్న డొంక ఎక్కడ ? మిల్లర్ల చేతివాటం ఉందా ? రేషన్ డీలర్ల మాయాజాలమా ? అనునిత్యం తనిఖీల సంగతి ఏంటి ? నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.