జగన్ రెడ్డీ ఢిల్లీలో ధర్నా ఎందుకు..?
నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సోదరుడు, వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన హత్యలను పట్టించుకోని జగన్… ఇప్పుడు మీ కార్యకర్తలను చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా అంటూ నిలదీశారు .
పార్టీ ఉనికి కోసమే జగన్ ఢిల్లీ డ్రామాలు మొదలు పెట్టారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే హాజరు కాకుండా ఢిల్లీ వెళ్లడం ఎందుకంటూ ప్రశ్నించారు. అంటే శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించరా..? ఇందుకేనా మీ పార్టీ నుంచి 11 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
గత ఐదేళ్లలో జగన్ హత్యా రాజకీయాలు చేశారంటూ ఆరోపించారు. సొంత బాబాయ్‌ను చంపిన వాళ్లతోనే తిరిగారని వాపోయారు. సొంత చెల్లెళ్లంటూ సపోర్ట్ చేయకుండా వెన్ను పోటు పొడిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు కోట్ల ప్రజల హక్కు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి.. గడిచిన ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎందుకు పోరాటం చేయలేదని, బాబాయ్‌ను చంపినప్పుడు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.