నామినేషన్ దాఖలు చేసిన షర్మిల
కడప ఎంపీ బరిలో ఏపీ పీసీసీ చీఫ్
కడప జిల్లా – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శనివారం కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జనం ఇంకా దివంగత అన్నదమ్ములు ఇద్దరు వైఎస్సార్, వైఎస్ వివేకానంద రెడ్డిని మరిచి పోలేదన్నారు. ప్రత్యేకించి దారుణంగా హత్యకు గురైన తన చిన్నాన్న విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.
ఈసారి ఆ ఇద్దరు మహా నేతలను గుర్తు పెట్టుకుని తమకు ఓటు వేస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు.
కడప ప్రజలు న్యాయం వైపు ఉండాలా లేక నేరం వైపు ఉండాలా అన్నది తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలపై రాష్ట్రం యావత్తు గమనిస్తోందని అన్నారు వైఎస్ షర్మిల.
ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలను మాత్రమే తాము ప్రస్తావిస్తున్నామని చెప్పారు. తెలియని అంశాల గురించి ఊసెత్తడం లేదన్నారు. ఇప్పటి వరకు ఇదే కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ బయట పెట్టినవేనని పేర్కొన్నారు ఏపీ పీసీసీ చీఫ్. భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువ లేకుండా పోయిందన్నారు. జగన్ రెడ్డి కొలువు తీరి ఐదేళ్లవుతున్నా ఎందుకని వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు.