NEWSANDHRA PRADESH

వైఎస్సార్ అభిమానుల‌కు ష‌ర్మిల బ‌హిరంగ లేఖ

Share it with your family & friends

మీడియా ఉంది క‌దా అని అడ్డగోలు ఆరోప‌ణ‌లు త‌గ‌దు

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె దివంగ‌త వైఎస్సార్ అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఇందులో మాజీ సీఎం , త‌న సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు.

అన్న చేతిలో మీడియా ఉంది. అందుకే అబ‌ద్దాల‌ను ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. వాస్త‌వాలు ఏమిటి అనేది తెలియ చేయాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ త‌న తండ్రి దివంగ‌త వైఎస్సార్ గురించి ఓ పుస్త‌కం రాశార‌ని, అందులో నాన్న గురించి ఒక మాట రాశార‌ని ఈ సంద‌ర్బంగా పంచుకున్నారు.

“రాజశేఖర్ రెడ్డి లోకం అంతా ఒకెత్తయితే”, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చూపు, తక్కువ చేసో చూడలేదన్నారు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. “నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం అని పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డి బ‌తికి ఉన్న స‌మ‌యంలో స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేన‌ని, అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదన్నారు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ “గార్డియన్ ” మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు.

సరస్వతి అయినా…భారతి సిమెంట్స్ అయినా… సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా… నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. ఆయ‌న బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎలాంటి ఆస్తులు పంచ‌లేద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌.

స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న ఆస్తులు అన్నీ కుటుంబ ఆస్తులేన‌ని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. నేను వాటాలు అడ‌గ‌డం లేద‌ని, త‌న తండ్రి స్థాపించిన వ్యాపారాల‌లో భాగం కావాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు.

త‌న తండ్రి చ‌ని పోయిన‌ప్పుడు 10 ఏళ్ల పాటు త‌న సోద‌రుడికి అండ‌గా ఉన్నాన‌ని అన్నారు. పార్టీని భుజాల మీద మోశాన‌ని చెప్పారు. రూ. 200 కోట్లు అనేది బ‌క్వాస్. అది డివిడెంట్ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సిఎం అయిన వెంటనే జగన్ గుర్తు పట్టలేనంతగా మారి పోయారని వాపోయారు. చిన్న చూపు చూడటమే కాకుండా సిఎం అయిన నెల రోజులకే విడిపోదాం అని ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు.

ఇందుకు అమ్మా, నేను వద్దు అని చెప్పామ‌న్నారు. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాడు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు.

సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే .. 5 శాతం ఎక్కువ తీసుకో.. లేదా 10 శాతం ఎక్కువ తీసుకో.. కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పింది. అయినా ఇంతే అని బుల్డోజ్ చేశారు. తర్వాత అర్ధగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగిందని తెలిపారు వైఎస్ ష‌ర్మిల‌.

ఆ కొద్దీ వారాల్లోనే ఎంఈవో తయారైంద‌ని తెలిపారు. అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి… అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టామ‌న్నారు.

కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, ఎంఈవో మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేద‌న్నారు. అమ్మ గట్టి ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హోల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ ఇండివిడ్యువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగిందన్నారు.

అదే 2021లో, నేను రాజకీయాల్లో అడుగు పెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగిందన్నారు. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నన్ను తొక్కడానికి జగన్ మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదన్నారు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తే, నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఉచ్ఛం, నీచం లేకుండా, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని వాపోయారు.

నన్నే కాదు, వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయాక.. ఆ ఓటమికి నేను కారణం అని వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని, బంధువులను నా దగ్గరకు పంపించడం జరిగింది.

మాకు విరోధం వద్దు అంటూనే.. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండీషన్ పెట్టారు. నేను జగన్ మోహన్ రెడ్డి మీద, భారతి రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం. ఆ కండిషన్ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించ లేద‌న్నారు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్ మెంట్ జరగలేదు.

సెటిల్ మెంట్ కి ఒప్పుకోలేదని మళ్ళీ కక్ష కట్టి, నా మీద, అమ్మ మీద NCLT లో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు.

నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ED అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి, ఆయన బెయిల్ రద్దు కి ఎటువంటి సంబంధం లేదు.

నిజానికి NCLT లో జగన్ మోహన్ రెడ్డి వేసిన కేసు అమ్మ మీద కాబట్టి, ఈ విషయం బయటకు వస్తే, YSR కుటుంబం అప్రతిష్ట పాలయితే, యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే, అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, ఇది మాలో మేమే విషాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నాము.

ఒక కుమారుడు తన తల్లికి తీసుకు రాకూడని పరిస్థితి ఇది. విలువలు, కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం.? అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం, నా పక్కనే నిలబడి మాటల్లేని వేదన నిండిన మా అమ్మను మరింత బాధ పెట్టకూడదని, అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి మేము ఎక్కడా బయట పెట్టలేదు.

బయట పడకుండా ఉండటానికి ప్రయత్నం చేశాం. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్ మోహన్ రెడ్డి కారణం అని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ మోహన్ రెడ్డికి, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా?

నేను జగన్ కి ఒక లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్ లో పోస్ట్ అయితే… నాకు ఏం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను గాని, నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం YSR బిడ్డకు లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌.

అమ్మ, నేను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తికోసం అత్యాశ పడుతున్నామని గాని, YSR అభిమానులు భావించకూడదని.. పైనున్న వాస్తవాలు అన్ని మీ ముందు పెట్టడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో “YSR బంధం” ఏర్పరుచుకున్న ప్రతి YSR బంధువుకి ఈ వివరణ ఇస్తున్నాను. YSR అభిమానులు ,అమ్మను నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని, వాస్తవాలను తెలియ చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.