సుప్రీం తీర్పు కేంద్ర..రాష్ట్ర సర్కార్లకు చెంపపెట్టు
లడ్డూ వివాదంపై నారా చంద్రబాబుపై ఆగ్రహం
విజయవాడ – తిరుపతి లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి ముందస్తు విచారణకు ఆదేశించకుండా బాధ్యత కలిగిన సీఎం బయటకు వచ్చి మీడియాకు ఎలా బ్రీఫ్ చేస్తారంటూ ప్రశ్నించింది ధర్మాసనం. జస్టిస్ గవాయ్ , జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం నిప్పులు చెరిగింది. ఒక రకంగా చంద్రబాబు కు షాక్ ఇచ్చింది .
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్రంగా స్పందించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సుప్రీం సూచనలతోనైనా ఇకనైనా మారాలని సూచించారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి, ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ కు చెంప పెట్టు అని పేర్కొన్నారు.
లడ్డూ వివాదానికి సంబంధించి కేంద్రం దర్యాప్తు చేయాలని, సీబీఐతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వాదిస్తోందన్నారు. ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయ్యిందని చెప్పారు. వైఎస్ షర్మిలా రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదన్నారు.
సీబీఐకి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందన్నారు. ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ? తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? అనేవి తేలుతాయన్నారు.
ఎన్డీడీబీ రిపోర్ట్ ను ఎందుకు ఇంత కాలం దాచి పెట్టారు ? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు.
మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే .. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.