దోషులను కాపాడుతున్న జగన్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రధానంగా తన చిన్నాన్న, దివంగత ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పేర్కొందని గుర్తు చేశారు.
అలాంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి జగన్ మోహన్ రెడ్డి తిరిగి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. హంతకులను , దోషులను కాపాడుతున్న జగన్ కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. లోకమంతా కోడై కూస్తోందని అయినా సీఎంకు సోయి రావడం లేదంటూ మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లెలో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోషులను కాపాడే ప్రయత్నం చేయడం మరింత నేరంలో భాగం కావడమేనని పేర్కొన్నారు. సీబీఐ హంతకులుగా చేర్చిన వారిని కాపాడేందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చారంటూ నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే తాను కడపలో ఎంపీగా బరిలోకి దిగానని చెప్పారు. ధర్మం గెలుస్తుందా లేక అధర్మానికి మీరు ఓటు వేస్తారా తేల్చుకోవాల్సింది ప్రజలేనని అన్నారు .